తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. అయితే, విజయవాడలోని జీజీహెచ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్ రాధా అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేసిన వెంటనే హెల్త్ వర్కర్ కళ్లు తిరిగి ఇబ్బందికి లోనయ్యారు. దీంతో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న కాస్సేపటికి చలిగా అనిపించిందని, కళ్లు తిరిగాయని రాధా తెలిపారు. వెంటనే వైద్యులు వైద్య సహాయం అందించారని, ఇప్పుడు కాస్త చలిగా ఉన్నా… ఇబ్బందేమీ లేదన్నారు.
అయితే, ఆమె ఉదయం నుండి ఎలాంటి ఆహరం తీసుకోకపోవటంతో పాటు వ్యాక్సిన్ పట్ల కాస్త భయంగా ఉండటంతోనే ఇబ్బందిపడిందని వైద్యులు తెలిపారు. ఆమె కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకోవటంతోనే ఇలా అయ్యిందన్న వార్తల్లో నిజం లేదన్నారు.
దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలయింది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో ఒక్కో సెంటర్ లో 30మందికి టీకా ఇవ్వనున్నారు.