కరోనా వైరస్ కు చెక్ పెట్టే ప్రధాన ఆయుధంగా పరిగణిస్తున్న వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. నిర్ణీత సమయంలోనే వ్యాక్సిన్ వేసుకొవాలన్న నిబంధనను వెనక్కి తీసుకొని, ప్రజలకు తమ అనువైన సమయంలో 24*7 ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు కేంద్రవైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.
మంగళవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ అధికారులు, ప్రైవేటు ఆసుపత్రులతో సమావేశంలోనూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఇదే విషయం చెప్పారు . వ్యాక్సిన్ పంపిణీ సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే అనేది తొలగిస్తున్నామని, ఆ తర్వాత కూడా వ్యాక్సినేషన్ చేసేందుకు సామర్థ్యం కలిగిన ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి టీకా పంపిణీ చేసేందుకు అనుమతి ఉంటుందన్నారు.
తొలి డోసు తీసుకున్న కరోనా వారియర్స్ కు ఫిబ్రవరి 13 నుంచి కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తున్నారు. ఈనెల 1 నుంచి వ్యాక్సినేషన్ రెండో దశను ప్రారంభించారు. 60 ఏళ్లకు పైబడిన వారికి, 45 ఏళ్లు అంతకన్నా ఎక్కువ ఉండి ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1.56 కోట్ల డోసులు ఇచ్చారు.