భారత మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి నుండి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలుకానుంది. ప్రధాని మోడీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కరోనాపై పోరులో ముందువరుసలో నిలిచిన వైద్యసిబ్బందికి జనవరి 15 కల్లా వ్యాక్సిన్ అందించేందుకు అన్ని రాష్ట్రాలకూ టీకాలను అందుబాటులో ఉంచుతామని కేంద్రం రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.
వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్ బయోటెక్, ఫైజర్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలోని ‘కొవిడ్-19 విషయ నిపుణుల కమిటీ’ ఈ మూడు విజ్ఞప్తులను పరిశీలిస్తుంది. తొలిదశలో మూడు కోట్ల డోసులకు సరిపడ టీకాలను నిల్వ చేసేందుకు సర్కార్ శీతల గిడ్డంగులను రెడీ చేసింది.
ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో 100మందికి టీకా ఇవ్వనుండగా… టీకా తీసుకున్న వారు కనీసం 30నిమిషాల పాటు అక్కడే ఉండాల్సి ఉంది. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారికి మెసెజ్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. మూడు వారాల తర్వాత రెండో డోసు ఇస్తారు. అప్పుడు మళ్లీ మెసెజ్ వస్తుందని వైద్యారోగ్యశాఖ వర్గాలంటున్నాయి. ఒకసారి తీసుకున్న కంపెనీ టీకానే రెండో డోసులోనూ తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ సరఫరా కోసం పలు ఎయిర్ పోర్టుల్లో ఎయిర్ కార్గోలను అందుబాటులో ఉంచారు.