దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే.. వచ్చే ఏడాది అక్టోబర్ వరకూ సమయం పట్టొచ్చని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా అంచనా వేశారు. జనవరిలోనే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ది ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో సీరమ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్-అక్టోబర్ నాటికి దేశ ప్రజలందరికీ సరిపడా వ్యాక్సిన్ డోసులు లభ్యమవుతాయని.. ఆ తర్వాత కరోనా మునుపటి రోజులు సాధ్యమవుతాయని అదర్ పూనావాలా విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఇండియాలో మొత్తం మూడు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి డీజీసీఐ అనుమతి లభించాల్సి ఉంది.