కరోనా వ్యాక్సిన్ తయారీపై అధ్యయనం కోసం విదేశీ ప్రతినిధులు నేడు హైదరాబాద్ రానున్నారు. 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు ఇందులో ఉన్నారు. భారత్‌లో పలు టీకాలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ.. వాటి గురించి వివరించేందుకు ఈ పర్యటన ఏర్పాటు చేసింది.
విదేశీ ప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయి… విడతలవారీగా భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థలను సందర్శిస్తాయి. భారత్ బయోటెక్‌లో వ్యాక్సిన్ అభివృద్ధిపై రూపొందించిన వీడియోను ప్రదర్శిస్తారు. ఆతర్వాత బయోలాజికల్-ఇ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలంగాణలో టీకాల తయారీ సంస్థల సామర్థ్యం, పనితీరు, జీనోమ్‌వ్యాలీ, ఫార్మాసిటీపై వీడియోను ప్రదర్శిస్తారు. ఆ తర్వాత భారత్ బయోటెక్‌లోని శాస్త్రవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ అవుతారు.
ఇంత పెద్దసంఖ్యలో విదేశీ రాయబారులు, హైకమిషనర్లు తెలంగాణను సందర్శించడం ఇదే ప్రథమం. వారి పర్యటనను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.