దేశంలో కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 223 కు పెరిగింది. వారిలో 32 మంది విదేశీయులున్నారు. దేశంలో కొన్ని వారాల క్రితం మొదలైన వైరస్ వ్యాప్తి శుక్రవారం ఒక్కరోజు నాడే అత్యధిక కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వ్యాధితో ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం అందరూ ‘‘జనతా‘‘ కర్ఫ్యూ ను పాటించాలని శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. ఒక్క రోజు జనతా కర్ఫ్యూ ని పాటిస్తే వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చని పేర్కొంది. ప్రజలకు ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1075 నెంబర్ కు ఫోన్ చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిత్యావసర సరుకుల కొరత లేదని…ప్రజలు ఆందోళన చెందొద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రజలు మత సమావేశాలు, పండుగలు వాయిదా వేసుకోవాలని కోరింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ్ ఫెస్టివల్ ను రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం శ్రీరామ నవమి, ఉగాది పండుగలను నిర్వహించడం లేదని ప్రకటించింది. పంజాబ్ సర్కార్ ఆదివారం నాడు రవాణా వాహనాలు నడపమని తెలిపింది.
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని గురువారం పిలుపునిచ్చారు. వీసాలు, అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడకుండా రాష్ట్రాలు నిషేధం విధించాయి. ప్రైవేట్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించాయి.