చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గురువారం నాటికి మృతుల సంఖ్య 1355 కి చేరుకుంది. బుధవారం ఒక్క రోజే 242 మంది చనిపోయారు. వీరంతా హుబెయ్ ఫ్రావిన్స్ కు చెందిన వారు. వైరస్ కారణంగా పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నట్టుగానే జరుగుతోంది. ఫిబ్రవరి 10న ఒక్క రోజే 103 మంది చనిపోయి రికార్డు సృష్టించిగా ఇప్పుడు ఆ సంఖ్యను దాటింది. మరో 14,840 కొత్త కేసులను నిర్ధారించారు. మృతుల సంఖ్య ఒక్కసారిగా ఎందుకు పెరిగిందో ఇప్పుడే నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని అజాగ్రత్తగా ఉండకూడదని…అది ఎప్పుడు విజృంభిస్తుందో చెప్పలేమన్నారు.
అమెరికాలో 13 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. సింగపూర్ లో 50 మందికి వైరస్ సోకింది. దాదాపు 24 దేశాల్లో వందల మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. అయితే విదేశాల్లో ఇద్దరు మాత్రమే వైరస్ కారణంగా చనిపోయారు. ఒకరు హాంగ్ కాంగ్ లో, మరొకరు ఫిలిప్పీన్స్ లో. చైనాకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం వైరస్ కట్టడికి బాగా పని చేస్తున్నట్టు డబ్ల్యూ.హెచ్.వో చీఫ్ టెడ్రోస్ కితాబిచ్చారు.