భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1100 కు చేరుకుంది. ఆదివారం మరో 130 మందికి ఈ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. కరోనా వైరస్ భారత్ లో ప్రవేశించాక అత్యధికంగా 24 గంటల్లో నమోదయిన కేసుల్లో ఆదివారం అత్యధికంగా వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 23 కొత్త కేసులు రావడంతో…అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఢిల్లీలో ఒకే రోజు పదికంటే ఎక్కువ మందికి వైరస్ సోకడం ఇదే మొదటి సారి. దీనిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
దేశ వ్యాప్తంగా చూస్తే ఆదివారంతో కలిపి వరుసగా మూడు రోజులు వంద కంటే ఎక్కువ కొత్త కేసులు వచ్చాయి. అయితే, కేంద్ర వైద్యారోగ్య శాఖ 1024 పాజిటివ్ కేసులు ఉన్నాయని, 27 మంది చనిపోయారని దృవీకరించింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 203 మందికి వైరస్ సోకగా ఆదివారం ఇద్దరు చనిపోయారు. దాంతో ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. పశ్చిమ ముంబైకి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్ భార్య, బుల్దానాకు చెందిన మరో వ్యక్తికి వైరస్ సోకింది. 40 ఏళ్లకు పైబడిన ఈ ఇద్దరూ విదేశాలకు ప్రయాణాలు చేయలేదని అధికారులు గుర్తించారు. దాంతో, ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తిపై అధికారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో తొలి వంద కేసులు 16 రోజుల్లోరాగా.. గత ఐదు రోజుల్లోనే మరో వంద మందికి పాజిటివ్ తేలింది.