తెలంగాణలో కరోనా స్టేజ్ 3కి చేరిందా…? ముఖ్యంగా మలక్ పేట్ గంజ్ నుండి జరిగిన కరోనా వైరస్ వ్యాప్తి సామాజిక వ్యాప్తిగా మారిందా అన్న అనుమానం కలుగుతోంది.
మలక్ పేట్ గంజ్ నుండి వ్యాపారం చేసే మధుసూదన్ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సరూర్ నగర్ లో నివాసముండే ఇతను ముందుగా జీవన్ సాయి అనే స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అక్కడ చికిత్స తీసుకుంటున్న సమయంలో తన సోదరుడు వచ్చి వెళ్లాడు. దాంతో వారి కుటుంబంలో దాదాపు 15మంది వరకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇతని తండ్రి ఏప్రిల్ 31న మరణించగా, మధుసూదన్ మే 1న మరణించాడు. దీంతో ఇది కమ్యూనిటి వ్యాప్తి చెందిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే… ప్రభుత్వం మాత్రం ఈ మొత్తం ఏపిసోడ్ లో కరోనా వైరస్ పాజిటివ్ సోర్స్ దొరికిందని, మొత్తం ట్రేస్ అవుట్ చేశామని వెల్లడించింది. అయితే కరోనా లక్షణాలున్నప్పటికీ వారు మొదట్లో ఆశ్రద్ధ వహించటంతో పరిస్థితి చేయిదాటిపోయిందని, దీనికి తోడు ఇతర ఆరోగ్య సమస్యలు తోడవటంతో మృత్యువాత పడ్డారని అంటోంది. సోర్స్ దొరికింది కాబట్టి ఇది కమ్యూనిటి ట్రాన్స్ ఫర్ కాదని వారి వాదన.
ఇక మధుసూదన్ మరణంపై తన భార్య కేటీఆర్ కు ఫిర్యాదు చేయటం, గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రియాక్షన్ తర్వాత ఆరోగ్యమంత్రి ఈటెల స్పందిచారు. మధుసూదన్ మరణ వార్త తన కుటుంబం తట్టుకోలేదని బంధువులు చెప్పారని, పైగా తన కుటుంబం అంతా అప్పుడు ఆసుపత్రిలోనే ఉండటంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు జీహెచ్ఎంసీ ద్వారా అంత్యక్రియలు పూర్తి చేశామని ప్రకటించారు.