తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ సడలింపులు మొదలైన తర్వాత కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా వలస కూలీలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 20రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా 519 కేసులు వచ్చాయి.
రాష్ట్రంలో నమోదైన 1661 కేసుల్లో 1120 కేసులు గ్రేటర్ పరిధిలోనే ఉండగా, 99 కేసులు వలస కూలీలవిగా ప్రభుత్వం లెక్కలు విడుదల చేసింది. ఇక గత మూడు, నాలుగు రోజులుగా మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. తెలంగాణలో మరణాల సంఖ్య 45కు చేరింది.
తాజాగా కూకట్ పల్లి జోన్ లో 6 పాజిటివ్ కేసులొచ్చాయి. మూసాపేట డివిజన్ బబ్బుగూడలో 1, పాండురంగానగర్‌లో 2, రెయిన్‌బో విస్తా 2, ఉషా ముళ్లపూడి రోడ్డులో 1 కేసు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇక సనత్ నగర్ లో ఓ వృద్ధురాలికి తాజాగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈమె కుటుంబాన్ని అధికారులు క్వారెంటైన్ చేశారు. ఇక నిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవల కోసం వచ్చిన వారిలో 11మందికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు తేలటంతో వారందరికీ పరీక్షలు చేశారు. ఇక గోషామహల్ కు చెందని ఓ వృద్దురాలికి కరోనా నిర్ధారణ కాగా, బాగ్ లింగంపల్లిలో మరికొందరు అనుమానితులు ఉన్నట్లు అధికారులంటున్నారు.
గ్రేటర్ లో కేవలం మూడు, నాలుగు డివిజన్లకే పరిమితం అయిన కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుందన్న అనుమానాలు రెట్టింపవుతున్నాయి.