చైనాలో కొవిడ్-19 (నోవెల్ కరోనావైరస్) మృతుల సంఖ్య బుధవారం నాటికి 1100 కు చేరుకుంది. మంగళవారంతో పోల్చితే 97 మంది కొత్తగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 45000 మందికి ఈ వైరస్ సోకింది. ఇందులో 44000 మంది చైనాకు చెందిన వారే. కొత్తగా 2,015 కొత్త కేసుల నమోదైనట్టు చైనా నేషనల్ హెల్త్ మిషన్ ప్రకటించింది. వారంతా కూడా హెబెయ్ ఫ్రావిన్స్ కు చెందిన వారు. చైనాలో ల్యూనార్ న్యూ ఇయర్ హాలీడే స్ ముగియడంతో ప్రజలు పనులకు వెళ్తున్నారు. రాజధాని బీజింగ్ తో పాటు ఇతర నగరాల్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రజలు కొవిడ్-19 (నోవెల్ కరోనా వైరస్) కు భయపడుతున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్-19 పై యుద్ధంలో మనం విజం సాధిస్తామని దేశాధ్యక్షుడు జిన్ పింగ్ పునరుద్ఘాటించారు.
మరోవైపు కొవిడ్-19 (కరోన వైరస్) నిరోధక వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి 18 నెలలు పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వైరస్ నియంత్రణ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు రోజుల పాటు వివిధ దేశాలతో సమావేశమైంది. వైరస్ పై విస్తృత పరిశోధనలు జరగుతున్నప్పటికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రాస్ అథానోమ్ గెబ్రెయేసస్ తెలిపారు. అప్పటిదాకా అందుబాటులో ఉన్నమందులతోనే పోరాడాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచానికి అత్యంత ప్రమాదకారిగా మారిన ఈ వైరస్ ను ప్రజల ప్రధాన శతృవుగా చూడాలని ప్రకటించారు. నిర్లక్ష్యం వహించినా…మన శతృవుగా పరిగణించకున్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొన్ని దేశాల్లోని ఉగ్రవాద చర్యల కంటే ఈ వైరస్ సృష్టించే బీభత్సం రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలను చిన్నాభిన్నం చేస్తుందని తెలిపింది. బలహీన ఆరోగ్య వ్యవస్థ ఉన్న 30 దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపించే అవకాశాలున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది.