కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సంక్రమిస్తోందంటూ తెలంగాణ అధికారులు బిగ్ బాంబ్ పేల్చారు. జాగ్రత్తపడకపోతే రాష్ట్రానికి కూడా మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని డీహెచ్‌వో డా.శ్రీనివాస్ హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆస్పత్రుల్లో బెడ్లకు కూడా కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి దశ కంటే మరింత వేగంగా వైరస్ వ్యాపిస్తోందని ఆయన చెప్పారు. ఒక్క ఇంటిలో ఎవరికైనా కరోనా సోకితే.. గంటల్లోనే అది మిగిలిన వారికీ సంక్రమిస్తోందని స్పష్టం చేశారు.
మరో నెల నుంచి రెండు నెలల వరకు రాష్ట్రంలో ఇదే తీవ్రత కొనసాగుతుందని డీహెచ్‌వో శ్రీనివాస్ వెల్లడించారు. ఇన్నాళ్లు ఇంటి నుంచి బయటకు వస్తేనే మాస్క్ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోందని..కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ప్రజలు కచ్చితంగా కఠినమైన స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు.