దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. లాక్ డౌన్ సడలిస్తున్న సమయంలో దేశంలో నమోదవుతున్న కొత్త కేసులు ప్రతి రోజు 5వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇక మరణాలు ప్రతి రోజు 100కు పైగానే ఉంటున్నాయి.
తాజాగా 24గంటల్లో 5609 కొత్త కేసులు రాగా, 132మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,12,359 చేరింది. 3435 మంది మరణించారు. ఇక 63,624 యాక్టివ్ కేసులుండగా, కరోనా నుండి 45,299 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు.
అంటే దేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతున్నా… కోలుకుంటున్న సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రతి అయిదుగురు కరోనా బాధితుల్లో దాదాపు ముగ్గురు కోలుకుంటున్నారు. మొదట్లో కేవలం 7శాతం మాత్రమే ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 40శాతానికి పైగా ఉంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరణాల రేటు కూడా విదేశాలతో పోల్చితే అదుపులోనే ఉందని భారత వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఇక దేశంలో కేసుల సంఖ్య పెరిగిపోతున్నా… ఒక్క మహారాష్ట్రలోనే 40వేల కేసులున్నాయి. వెయ్యికి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇక తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాలు అంటే ఈ నాలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 65శాతం కేసులు నమోదయ్యాయి.