దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే వారం రోజులుగా కొత్త కేసులు 40 వేలకు దిగువనే నమోదు కావడం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36 వేల 652 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దీంతోఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 96 లక్షలు దాటింది. ఇక కరోనా కారణంగా నిన్న 512 మంది మరణించారు. వీరితో కలిపి మొత్తం మరణాలు లక్షా 39 వేల 700కు పెరిగాయి.
కరోనా పడేవారి సంఖ్య భారీగానే ఉంటున్నా.. రికవరీ రేట్ ఆశాజనకంగా ఉంది. ఇప్పటివరకు దేశంలో 90.58 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4.09 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే వ్యాక్సిన్‌పై తాజా పరిణామాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దాదాపు 10 వరకు వ్యాక్సిన్లు మెరుగైన ఫలితాలని ఇస్తున్నాయి. అటు నిన్నటి అఖిల పక్ష సమావేశంలో… దేశంలో మరి కొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని స్వయంగా ప్రధాని ప్రకటించడం ఊరట కలిగిస్తోంది.