దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముందు రోజు రికార్డును బ్రేక్ చేస్తూ.. మరుసటి రోజు కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువయ్యాయి. ఈ మహమ్మారి ఎప్పుడు వదిలిపోతుందో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డా.సమీరన్ పాండా ఓ శుభవార్త చెప్పారు.
ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగుస్తుందని అంచనా వేశారు. అయితే దీనికి కొన్ని కండీషన్లు కూడా ఆయన విధించారు. ప్రస్తుతం ప్రజల్లో కరోనా భయం ఉందని.. దీంతో.. జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. మాస్కులు వాడుతూ వ్యక్తిగత దూరం పాటిస్తున్నారని అన్నారు. ప్రజలు ఇదే జాగ్రత్త పాటిస్తే.. కొత్త వేరియంట్లు పుట్టకపోతే 11 నాటికి కరోనా అంతం అవుతోందని తెలిపారు.
ఆ తరువాత అది ఓ సాధారణ ఫ్లూగా మారిపోతుందని డా.సమీరన్ అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ స్థానాన్ని భర్తీ చేసే కొత్త వేరియంట్లు రావని తమ అభిప్రాయమని కూడా చెప్పారు. తమ లెక్కల ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ మూడు నెలల పాటే ఉంటుందన్నారు. డిసెంబర్ 11న మొదలైన ఒమిక్రాన్ వేరియంట్ మార్చి 11తో ముగుస్తుందన్నారు. ఇప్పటికే నగరాల్లో కరోనా గరిష్ట స్థాయికి చేరుకుందని చెప్పారు.
గడిచిన 24 గంటల్లో 2,82,970 మంది కరోనా బారిన పడ్డారు. ముందు రోజు కంటే సుమారు 45 వేల కేసులు ఎక్కువగా నమోదయ్యయి. ఈ రోజు కరోనాతో 441 మంది మరణించారు. దీంతో దేశంలో మృతుల సంఖ్య 4,87,202కి పెరిగింది. అటు.. కొత్తగా 1,88,157 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,55,83,039మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రోజు పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.