.
తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసే కరోనా బులెటిన్‌పై ఎప్పుడూ ఏదో ఓ సందేహం తెరపైకి వస్తూనే ఉంది. ముఖ్యంగా జిల్లా వైద్య అధికారులు ప్రకటించే లెక్కలకు.. స్టేట్ బులెటిన్‌లో కనబడే అంకెలకు అస్సలు పోలికే ఉండటం లేదు. ఉదయం జిల్లా పేపర్ తిరగేస్తే కరోనా కేసుల సంఖ్య ఒకలా ఉంటే… కాసేపయ్యాక విడుదలయ్యే ప్రభుత్వ బులెటిన్‌లో మరోలా ఉంటోంది. మళ్లీ ఇందులో మరో సందేహం.. ఒక్కో న్యూస్ పేపర్‌కు ఒక్కో రకంగా కేసుల వివరాలను అందిస్తున్నారు. దీంతో అసలు ఎవరు చెప్పే లెక్క నిజమే తెలియక జనం బుర్రబద్దలు కొంటుకుంటున్నారు.
ఇవాళ్టి స్టేట్ బులిటెన్, జిల్లాల్లో వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన కరోనా వివరాల్లో ఎన్ని తేడాలున్నాయో ఓసారి గమనించండి.
ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా తీసుకుందాం.. స్టేట్ బులెటిన్‌లో 63 అని ప్రకటించారు. అదే న్యూస్ పేపర్లను పరిశీలిస్తే.. సాక్షి ఆదిలాబాద్ ఎడిషన్‌లో 33, ఈనాడు ఆదిలాబాద్ ఎడిషన్ 31 , ఆంధ్రజ్యోతి ఆదిలాబాద్ ఎడిషన్‌లో 33గా ప్రచురించారు.
మరో జిల్లా సిద్దిపేట కరోనా లెక్కలు పరిశీలిద్దాం.. స్టేట్ బులెటిన్‌లో కేవలం 45 కేసులకే పరిమితం చేస్తే.. న్యూస్‌పేపర్ల విషయానికి వచ్చేసరికి ఈ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. సాక్షి సిద్దిపేట ఎడిషన్‌లో 78గా చెప్తే.., ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎడిషన్లలో 88గా సమాచారం ఇచ్చారు.
చూశారుగా.. అసలు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పొరబాటు చేస్తోందా. . లేక జిల్లా వైద్యాధికారులే ప్రభుత్వానికో లెక్క, వార్తా పత్రికలకు మరో లెక్క చెప్తున్నారా.. అర్థం కావడం లేదు. ఏంటో కరోనా కంటే ఈ లెక్కలే జనాన్ని బాగా కన్ఫ్యూజన్ చేస్తున్నాయి.