కరోనా వైరస్ అత్యంత ప్రాణాంతకమైనదని ముందుగా గుర్తించి తోటి డాక్టర్లకు హెచ్చరించిన చైనా డాక్టర్ అదే వైరస్ సోకి చనిపోయిన విషాద సంఘటన గురువారం అర్ధరాత్రి జరిగింది.
డాక్టర్ లీ వెన్ లియాంగ్ (34) ఆప్తమాలజిస్ట్. చైనాలోని వుహాన్ సెంట్రల్ హాస్పిటల్లో పనిచేసేవాడు. తాను పనిచేసే హాస్పిటల్లో ఏడుగురు కరనా వైరస్ బాధితులను చూసిన ఆయన ఇది 2003 లో ప్రపంచవ్యాప్తంగా వందలాది మందిని బలి తీసుకున్న సార్స్ వైరస్ ను పోలి ఉందని గ్రహించాడు. తన తోటి డాక్టర్లకు ప్రమాదం గురించి హెచ్చరించాలనుకున్నాడు. వైరస్ సోకకుండా ప్రొటెక్టివ్ దుస్తులు ధరించాలని డిసెంబర్ 30 వ తేదీని తోటి డాక్టర్లను సోషల్ మీడియా విబో గ్రూప్ చాట్ లో హెచ్చరించాడు. దీనికి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నాలుగు రోజుల తర్వాత వెన్ లియాంగ్ పుకార్లు వ్యాప్తి చేస్తున్నారంటూ ప్రభుత్వం సంస్థ పబ్లిక్ సెక్యూర్టీ గ్రూప్ నిందించింది. తాను తప్పు చేసినట్టు ఆయన చేత ఓ కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకుంది. డాక్టర్ తో పాటు మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు ఈ వైరస్ సోకి హాస్పిటల్ బెడ్ కే పరిమితమయ్యాడు.
విబో సోషల్ మీడియా పోస్టులో తనకు వైరస్ ఏ విధంగా సంక్రమించిందో లియాంగ్ వివరించాడు. జనవరి 10న దగ్గు మొదలైంది. రెండు రోజుల తర్వాత జ్వరమొచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు హాస్పిటల్లో చేరాను. జనవరి 30న కరోనా వైరస్ ను గుర్తించారు అని తెలిపాడు. ఆ తర్వాత హాస్పిటల్ బెడ్ కే పరిమితమైన లియాంగ్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్టు చైనా మీడియా గ్లోబల్ టైమ్స్, పీపుల్స్ మీడియా ప్రకటించాయి.
డాక్టర్ లీ వెన్ లియాంగ్ మరణ వార్త తెలియగానే చైనా సోషల్ మీడియాలో విషాదం, ఆవేశం ఒక్కసారిగా పెల్లుబికాయి. ”వుహాన్ గవర్నమెంట్ ఓస్ డాక్టర్ లీ వెన్ లియాంగ్ అండ్ అపాలోజీ ( డాక్టర్ లీ వెన్ లియాంగ్ ను బలి తీసుకున్న వుహాన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి)”, ” వుయ్ వాంట్ ప్రీడమ్ ఆఫ్ స్పీచ్ ( మాకు భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి)” అనే యాష్ ట్యాగ్ లు వెబ్ సైట్ లో ట్రెండింగ్ గా మారాయి. ఈ రెండు యాష్ ట్యాగ్ లపై వెంటనే ప్రభుత్వం నిషేధం విధించింది.శుక్రవారం ఉదయానికి వందలాది కామెంట్లను తొలగించారు. తాజాగా ” కెన్ యు మేనేజ్, డూ యు అండర్ స్టాండ్?” అనే యాష్ ట్యాగ్ లతో పోస్టింగ్ పెట్టారు. వీటికి కూడా వందలాది కామెంట్లు పెడుతున్నారు. చైనా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ” నిజాన్ని ఎప్పటికి పుకారు గానే భావిస్తారు..ఎంత కాలం అబద్ధం చెబుతావు..? ఇంకా అబద్ధం చెబుతూనే ఉన్నావు..? ఇంకా దాచడానికి ఏం మిగిలింది..?” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.