నగరంలోని ఎర్రమంజిల్ పరిధి రామకృష్ణా నగర్‌లో గుడిసెల తొలగింపు ప్రక్రియను అధికారులు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా 200 మంది రోడ్లు భవనాల శాఖ, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖ, పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకొని గుడిసెల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.
ఈ విషయం గురించి సమాచారం అందుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి అక్కడికి చేరుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడిసెలను కూల్చవద్దని..నివాస వసతి కల్పించాకే ఇక్కడ ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.
అక్కడ నివాసం ఉంటున్న పేదవారు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారని అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో అధికారులతో ఆమె వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు విజయారెడ్డిని అరెస్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్ ఠాణాకు తరలించారు.
గుడిసెల్లో నివసిస్తున్న పలువురిని అదుపులోనికి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.