జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోని పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడమే టీఆర్ఎస్ లక్ష్యమని ఆరోగ్య శాక మంత్రి హరీష్ రావు అన్నారు. ఫీవర్ హాస్పిటల్ లో కొత్త ఔట్ పేషెంట్ బ్లాక్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల్లో హైదరాబాద్ లోని అన్ని అగ్రశ్రేణి తృతీయ ఆసుపత్రుల్లో భారీ పునర్నిర్మాణం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ ఆసుపత్రిలో రూ.10.91 కోట్ల విలువైన మెడికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇందులో 1,000 మందికి పైగా రోగులకు వసతి కల్పించడానికి అత్యాధునిక ఔట్ పేషెంట్ బ్లాక్, రూ. 50 లక్షలతో డయాలసిస్ సౌకర్యం, అత్యాధునిక సదుపాయాలను కల్పంచామని అన్నారు.
60 లక్షల విలువైన మార్చురీ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు హరీష్ రావు. రాష్ట్రంలోని నిరుపేద రోగులకు ప్రత్యేక సేవలను అందించడానికి 13 శవవాహక వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 61 మార్చురీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.32.54 కోట్లు విడుదల చేసిందని స్పష్టం చేశారు.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో రూ.32.54 కోట్లతో అత్యాధునికమైన మార్చురీ కూడా రాబోతోందని తెలిపారు. గతంలో ఒక కుటుంబానికి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ కవరేజీని రూ.2 లక్షలకే పరిమితం చేశారని.. దాన్ని రూ.5 లక్షలకు పెంచామని హరీష్‌రావు గుర్తు చేశారు. ప్రతీ పేద వాడికి కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు హరీష్.