ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు తెలంగాణ సర్కార్ కల్పిస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఆయన కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని ప్రగతి నగర్ లో ఆధునిక వసతులతో రూపుదిద్దుకున్న మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్,పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన, మేయర్ నీలా గోపాల్ రెడ్డి, అధికారుల, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ఆధునిక వసతులు కల్పించిన అనంతరం 700 ప్రభుత్వ పాఠశాలలను ఓకే రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఈ ప్రోగ్రామ్ కు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఒక వైపు నాణ్యమైన బోధన అందిస్తూనే మరో వైపు వసతుల కల్పన చేపట్టామన్నారు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభించమన్నారు. డిజిటల్ క్లాసులు పిల్లలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. స్కూల్ పిల్లలకు శానిటేషన్ కిట్స్ ఇవ్వబోతున్నాం..వారం పది రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు.
9 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నామని అని అన్నారు. ప్రమోషన్లు పూర్తి కాగానే టీచర్ల భర్తీ ప్రక్రియ చేపట్టబోతున్నామని చెప్పారు. ఉపాధ్యాయులు పిల్లలకు సామాజిక అంశాలపై అవగాహన పెంచాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సాధించాలి. ఎంబీబీఎస్ సీట్లు పొందాలి, అత్యున్నత స్థాయికి ఎదగాలని మంత్రి హరీశ్ రావు ఆకాంక్షించారు.