బంజారాహిల్స్ సీఐ తనతో అసభ్యంగా మాట్లాడారని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. కార్పొరేటర్ అయిన తన పట్లనే సీఐ ఇలా వ్యవహరిస్తే సాధారణ మహిళల పరిస్థితేంటని ఆమె ప్రశ్నించారు.
బంజారాహిల్స్ పోలీసులు వ్యవహరించిన తీరు సరిగాలేదని ఆమె అన్నారు. ఈ విషయంలో పోలీసులు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన తమను పోలీసులు అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తంచేశారు.
తమను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తే పోలీసులు సరైన సమాధానం ఇవ్వడం లేదన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అరెస్టు చేసే సమయంలో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంటికి వచ్చి మరీ తనను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఓ ఎంపీగా తన పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా తిరగ కూడదా? అంటూ ఆయన పోలీసులపై మండిపడ్డారు. ధర్నా చౌక్‌కు వెళ్తున్నట్లు తానైమైనా చెప్పానా అంటూ పోలీసులను ఆయన నిలదీశారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా?అని ఆయన అన్నారు.
ఇంట్లో నుంచి బయటికి వచ్చేందుకు కూడా పోలీసుల అనుమతి తీసుకోవాలా? అని అడిగారు. అంతకుముందు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో పోలీసులపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడ నుంచైతే ఆమె తీసుకెళ్లారో అక్కడికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.