వారియర్ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు హీరో రామ్. లింగుసామి హ్యాండ్ తో కోలీవుడ్ లో పాతుకుపోవచ్చని ప్లాన్ చేశాడు. అయితే కోలీవుడ్ సంగతి దేవుడెరుగు, టాలీవుడ్ లో కూడా ఆ సినిమా ఆడలేదు. రామ్ కెరీర్ లో ఫ్లాప్ మూవీగా నిలిచింది వారియర్. అయితే ఇలాంటి ఫ్లాపులు రామ్ కు కొత్త కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తినే ఈ స్థాయికి వచ్చాడు. అయితే వారియర్ ఎఫెక్ట్, అతడి నెక్ట్స్ సినిమాపై పడింది.
వారియర్ హిట్ అవుతుందనే నమ్మకంతో, బోయపాటి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం చాలా ప్లాన్ చేసుకున్నాడు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. వారియర్ సినిమాకు కూడా ఇతడే నిర్మాత. అది పెద్ద హిట్టయితే, బోయపాటి సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీయాలని అనుకున్నాడు. కానీ.. ఇప్పుడు వారియర్ దెబ్బతో చిట్టూరి ప్లాన్స్ మారిపోయాయి.
బోయపాటి దర్శకత్వంలో రామ్ హీరోగా రాబోతున్న సినిమాకు కాస్ట్ కటింగ్స్ మొదలైనట్టు తెలుస్తోంది. ముందు అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు 40శాతం తగ్గించి సినిమా పూర్తిచేయాలని నిర్మాత భావిస్తున్నాడు. అయితే బోయపాటి సీన్ లో ఉండగా అది సాధ్యమా అనేది అందరి అనుమానం.
భారీతనానికి పెట్టింది పేరు బోయపాటి. తను అనుకున్న సీన్ కోసం నిర్మాత నుంచి ఎంత ఖర్చు అయినా పెట్టిస్తాడు. అలాంటి దర్శకుడ్ని బడ్జెట్ విషయంలో కట్టడి చేయడం చాలా కష్టం. మరి రామ్ సినిమా కోసం బడ్జెట్ తగ్గించాలనుకుంటున్న నిర్మాత ఆలోచనలు అమలు అవుతాయో లేదో చూడాలి. అయితే.. పాన్ ఇండియా లెవెల్లో పలు భాషల్లో ఈ సినిమా తీద్దామనే నిర్ణయం నుంచి మాత్రం మేకర్స్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.