ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ సంస్థల్లో కుదుపు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ భారీగా పెట్టుబడులు పెట్టిన ఓటీటీ సంస్థలన్నీ ఇప్పుడు తమ ప్రణాళికల్ని పునఃసమీక్షించుకుంటున్నాయి. ఇందులో భాగంగా నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే మార్కెట్ కు పెద్ద షాక్ ఇచ్చింది. కంటెంట్ బడ్జెట్ నుంచి అమాంతం 50శాతం కోత విధించింది. దాదాపు 10వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను తగ్గించేసింది. ఇది మార్కెట్ పై చాలా పెద్ద ప్రభావం చూపించబోతోంది.
ఇప్పుడు అంతర్గతంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ సంస్థ. తమ సంస్థ నుంచి దాదాపు 150 మంది సీనియర్ లెవెల్ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనుంది. ఈ మేరకు కొంతమందికి సమాచారం కూడా ఇచ్చింది. ఇలా అటు బడ్జెట్ పరంగా, ఇటు ఉద్యోగుల పరంగా కోతలు మొదలు పెట్టింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.
ఇదే బాటలో అమెజాన్ కూడా నడుస్తోంది. ఇన్నాళ్లూ కంటెంట్ పై కళ్లుమూసుకొని కోట్లు ఖర్చు పెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు రీజనల్ కంటెంట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏ సినిమా దొరికితే ఆ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టడం లేదు. ఇక ఒరిజినల్స్ విషయానికొస్తే, కాస్త తెలిసిన ముఖాలున్న సినిమాలను మాత్రమే తీసుకోవాలని ఇంటర్నల్ గా ఆదేశాలు జారీ చేసింది.
అటు ఆహాస జీ5 సంస్థలు ఆల్రెడీ కాస్ట్ కటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. చాలా తక్కువగా సినిమాలు కొనుగోలు చేస్తూ, తక్కువ బడ్జెట్ లో దొరికే సినిమాల్ని తీసుకుంటూ ఓటీటీల్ని రన్ చేస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఓటీటీ రంగంలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని ట్రేడ్ భావిస్తోంది.