మన నిత్య జీవితంలో ఏదో ఒక పేరుతో మోసాలు జరగడాన్ని చూస్తూనే, వింటూనే ఉంటున్నాం. కొందరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేస్తే.. మరికొందరి డబ్బు అవసరాన్నిక్యాష్‌గా మార్చుకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు..
చైన్ సిస్టమ్ తో కొందరు మోసం చేస్తుంటారు. తాజాగా వత్తులు చేసి ఇస్తే రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మబలికి డబ్బును హారతి కర్పూరం చేసేశారు. హైదరాబాద్‌లో బోడుప్పల్ లో ఓ ఘరాననా మోసం బయటపడింది. ఏబీజీ అనే సంస్ధ వత్తుల తయారీ పేరిట భారీగా డిపాజిట్లు వసూలు చేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది.
వత్తుల తయారీకి యంత్రాలు, దూది తామే ఇస్తామని నమ్మబలికిన సంస్థ ఒక్కొక్కరి నుంచి రూ.1.70 లక్షల చొప్పున డిపాజిట్ సేకరించింది. కిలో దూది రూ.300 చెల్లించి తీసుకుని వత్తులు తయారు చేసి ఇస్తే రూ.600 చెల్లిస్తామంటూ ఒప్పందం చేసుకుంది. ఆరు నెలల తర్వాత డిపాజిట్ డబ్బులు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామంటూ ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మిన చాలామంది డిపాజిట్లు కట్టి స్కీమ్‌లో చేరారు.
మొదటి నెల సక్రమంగా డబ్బులు ఇచ్చిన సంస్థ రెండు నెలలకే బోర్డు తిప్పేయడంతో ఏబీజీ కంపెనీ యజమాని బాలస్వామి గౌడ్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏబీజీ కంపెనీ సుమారు 600 మంది నుంచి రూ.20కోట్ల మేర డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో ఏబీజీ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.