” కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హతలన్నీ ఉన్నాయి “.. “నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నన్నెవరూ సంప్రదించలేదు” ..తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలివి. ఈ రెండు వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని అనిపిస్తుంది. కానీ తరచిచూస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి మనసులోని అసలైన మాటలు అర్థమవుతాయంటున్నారు విశ్లేషకులు.
ఎమ్మెల్సీగా ఈ ఏడాది జూన్ వరకు సుఖేందర్ రెడ్డి పదవీకాలం ఉంది. ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్సీ లేదా వేరే ఏదైనా పదవి దక్కాలంటే.. ఎప్పటివరకు ఎదురుచూడాలో గ్యారంటీ లేదు. పైగా ఇప్పటికే శాసన మండలి చైర్మన్‌గా చేసి.. కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డికి సరైన న్యాయమే చేశానని భావిస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన భవిష్యత్ ఏమిటనేదానిపై క్లారిటీ లేదు. పైగా ఒక్కసారయినా మంత్రి పదవి అనుభవించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరిక అని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. ఈ క్రమంలో ఆయనకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓ అవకాశంలా కనిపిస్తోంది. జానారెడ్డి ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే.. తానే సరైన వ్యక్తిని అని ఇప్పటికే తనకు తెలిసిన మార్గాల్లో టీఆర్ఎస్ హైకమాండ్‌కు తెలియపరిచినట్టుగా తెలుస్తోంది.
గుత్తా అందుకే సాగర్‌లో స్థానికులు, స్థానికేతరులు అనే నినాదం అర్ధరహితమని.. నేతలంతా హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గాలకు వచ్చిపోతున్నారని గుర్తు చేశారు. పైగా నల్గొండ జిల్లా రాజకీయ పరిస్థితులు వేరని.. రాజకీయాల్లో ఎవరికీ ఎవరూ పోటీ కాదంటూ ఉప ఎన్నికల్లో పోటీపై ఇన్‌డైరెక్ట్‌గా తన ఆసక్తిని తెలియజేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.