ఆయనో కౌన్సిలర్ కు భర్త. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదే. అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడు.. ప్రజలకి తానే కౌన్సిలర్ నని చెప్పుకుంటాడు. స్థానికంగా ఏం జరిగినా తానూ ఉండాల్సిందేనని పట్టుబడతాడు. ఇంతకీ ఆయన ఎవరనేగా. తెల్లాపూర్ లో కౌన్సిలర్ సుచరిత భర్త ఒగ్గు కొమురయ్య.
తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో రాజ్ కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోనాలు, పలారం బండి కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫోటో వేయలేదన్న అక్కసుతో కుట్రపూరితంగా వాటిని తొలగించాడు కొమురయ్య. తెల్లాపూర్ మున్సిపాల్టీ తీర్మానాల ప్రకారం ఏదైనా కార్యక్రమం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే కనీసం 3 రోజుల వరకు అనుమతి ఉంది. కానీ.. ఫ్లెక్సీలు పెట్టిన కొన్ని గంటలకే తీసేయించాడు కొమురయ్య.
ఏ కార్యక్రమం చేసినా తనకు చెప్పాలని, ఫ్లెక్సీల్లో తన ఫోటో వేయాలని లేదంటే పరిణామాలు ఇలానే ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫోటో ఉన్నా కూడా తొలగించాడు కౌన్సిలర్ భర్త. ఇతడి ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని వాపోతున్నారు స్థానికులు. భార్య స్థానంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటాడని… తమ సమస్యలు చెప్పుకోవడానికి కౌన్సిలర్ దగ్గరకు వెళ్తే.. నేనే కౌన్సిలర్ ని నాకే చెప్పండని బెదిరిస్తాడని అంటున్నారు. అతని చేష్టలతో విసిగిపోయి ఇటీవల కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.