తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు కాకరేపుతున్నాయి. రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానాలు ప్రకటించడం ట్రెండింగ్ గా మారింది. ఎల్లారెడ్డి, వనపర్తి, ఆర్మూర్, జనగామ, నంది కొండ, యాదగిరి గుట్ట, చండూరు, జగిత్యాల, భువనగిరి, ఇల్లందు, మేడ్చల్ మున్సిపాలిటీల్లో చైర్మన్లకు, కౌన్సిలర్లకు పొసగడం లేదు. దీంతో కౌన్సిలర్లు చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలను పెడుతున్నారు.
తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పై మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు ఎనిమిది మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, అందోల్- జోగిపేట మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు కలెక్టర్ కు అవిశ్వాస తీర్మానం అందజేశారు.
దీంతో పాటు.. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తాపై సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. 20 మంది సభ్యులున్న కౌన్సిల్ లో 14 మంది తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు నోటీసును అందజేశారు. దీంతో మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల అంశం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది.