ప్రస్తుతం తెలంగాణ అంతటా బతుకమ్మ సంబరాలు కనిపిస్తున్నాయి. ఊరూవాడ పండుగ శోభ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బాగా ఫేమస్ అయిన బతుకమ్మ పాటలను కాస్త వ్యంగ్యంగా చేసిన సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ హామీలు, వైఫల్యాలకు సంబంధించిన ఈ పాటలు.. అందరి ఫోన్లలోకి చేరుతున్నాయి. ముఖ్యంగా రెండు పాటలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఈటలకు మద్దతుగా.. కేసీఆర్ కు కౌంటర్లతో ఉన్నది ఒకటి కాగా… అచ్చంగా కేసీఆర్ టార్గెట్ గా ఉన్న సాంగ్ మరొకటి.
‘‘ఫాం హౌస్ లో ఉండే వలలో.. పాలన మాకొద్దే వలలో.. సచివాలయానికి వలలో.. రానే రాడమ్మ వలలో.. ప్రగతి భవన్ నుంచి వలలో.. ప్రకటన చేస్తాడే వలలో.. ప్రజలు చస్తున్నా పట్టించుకోడమ్మ వలలో.. ఎటకారం మాటలతో హేళన చేస్తాడే వలలో.. ఝూటా మాటాలతో వలలో.. గారడి చేస్తాడే వలలో.. తన కొడుకు, బిడ్డలను వలలో కొలువుల పెట్టిండే వలలో.. మన కొడుకు, బిడ్డలను వలలో.. కూలీల చేసిండే వలలో.. ఈటలకు ఓటేద్దాం వలలో.. దొర ఆటలు కట్టిద్దాం వలలో’’ అంటూ సాగుతున్న పాట ఒకటి బాగా వైరల్ అవుతోంది.
అలాగే ‘‘నోటిఫికేషన్లు ఉయ్యాలో.. నోటిమాటలాయే ఉయ్యాలో.. నిరుద్యోగి భృతి ఉయ్యాలో.. నోటిమూటలాయే ఉయ్యాలో.. రైతుల రుణామాఫీ ఉయ్యాలో.. ఖాతాలేని కూతలో ఉయ్యాలో.. కేజీ టు పీజీ అనే ఉయ్యాలో.. ఉచిత విద్య లేకపాయో ఉయ్యాలో.. మూడెకరాల ముచ్చట ఉయ్యాలో.. మూలకే పడే ఉయ్యాలో.. దళితబంధు అనే ఉయ్యాలో.. దగా చేయబట్టే ఉయ్యాలో’’.. అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న పాట వాట్సాప్ స్టేటస్ లలో బాగా కనిపిస్తోంది.
హామీలిచ్చి విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ బతుకమ్మ పాటలను రూపొందించారు. ప్రస్తుతం బతుకమ్మ పండుగ హడావుడి.. హుజూరాబాద్ ఎన్నికల టెన్షన్ లో ఈ పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.