ఈ దేశానికి విద్యావంతుడైన ప్రధాని అవసరమని ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. విద్య ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోగలిగిన ప్రధానమంత్రి ఇండియాకు అవసరమని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియాను,సత్యేంద్ర జైన్ ను ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని ఆయన ఖండిస్తూ.. సిసోడియాను జైలుకు పంపిన నాడే దేశానికి విద్యావంతుడైన ప్రధాని అవసరమని అభిప్రాయపడ్డానని తెలిపారు.
మధ్యప్రదేశ్ లో బుధవారం జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆయన.. కరోనా పాండమిక్ సమయంలో దీన్ని తరిమి కొట్టేందుకు ప్లేట్లు వాయించాలని ప్రజలను మోడీ కోరారని, అయితే కరోనా పోయిందా అని ప్రశ్నించారు. బహుశా ఎవరో చేసిన సూచనను బట్టే మోడీ ఆ పిలుపునిచ్చినట్టు కనిపిస్తోందన్నారు.
ఢిల్లీలో విద్య, ఆరోగ్య రంగాల్లో సిసోడియా, జైన్ విప్లవాత్మక మార్పులను తెచ్చారని, అందుకు ప్రతిగా వారిని అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండి అవినీతి చేయరాదని, కానీ బీజేపీలో చేరిన తరువాత ఆ పని చేయవచ్చునన్నదే బీజేపీ వైఖరిగా కనిపిస్తున్నట్టు కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
అవినీతి పరుడైన వ్యక్తి ప్రైవేటు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వ స్కూళ్లను, ఆసుపత్రులను కూల్చివేస్తారని, అంతేగానీ వారు స్కూళ్లను, ఆసుపత్రులను నిర్మిస్తారా అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రజలు తమ పార్టీకి ఓటు వేసి అధికారంలోకి తేవాలని ఆయన కోరారు. ఒక్కసారి ఆప్ కు అవకాశం ఇవ్వండి అన్నారు. ప్రజలకు తాము న్యాయం చేయలేని పక్షంలో మళ్ళీ వారి ముందుకు రాబోమని ఆయన అన్నారు.