దైవ భక్తి ఉండొచ్చు, మూఢ భక్తి ఉండడం ప్రమాదకరం. అది వారికే కాదు, వారిని నమ్మకున్న వారికి కూడా చేటు చేస్తుంది. దానికి కర్ణాటక రాష్ట్రంలోని జరిగిన తాజా సంఘటనే ఉదాహరణ. ఓ వ్యక్తి దేవుడు చెప్పాడంటూ సజావుగా సాగుతున్న కాపురాన్ని కాలదన్నుకున్నాడు.
ప్రేమగా ఉంటున్న తన భార్యకు విడాకులిచ్చాడు. అయితే ఈ విడాకుల కేసు కోర్టులో విచారణకు రాగా…న్యాయమూర్తి సదరు వ్యక్తి చెప్పిన విచిత్రమైన కారణం విని అవాక్కయ్యాడు. ఈ వింత సంఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హందనకెరె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దేవుడు చెప్పాడని భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
భార్యాభర్తల మధ్య విడాకులకు సెక్స్, ఆస్తి, అనైతిక సంబంధం, వరకట్న వేధింపులు, దాడి, విడిపోవడానికి ఇలా అనేక కారణాలున్నాయి. అయితే, దేవుడు చెప్పాడని తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఎందుకు ప్రతిపాదించాడో కారణాన్ని అడిగిన తర్వాత న్యాయమూర్తి పిటిషనర్‌ను మందలించారు.
చిక్కనాయకనహళ్లి తాలూకా హందనకెరెలో మంజునాథ్, పార్వతమ్మలకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారిద్దరూ జంటగా సామరస్య జీవితాన్ని గడుపుతున్నారు. అయితే దేవుడు చెప్పాడంటూ మంజునాథ్ మూఢనమ్మకంతో భార్యకు విడాకులు ఇవ్వాలని కోర్టుకు వెళ్లాడు.
చిక్కనాయకనహళ్లి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చిక్కనాయకనహళ్లి కోర్టు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశప్ప వాదనను పూర్తిగా వినిపించారు. దంపతులు ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేకపోయినా దేవుడి మాటకోసం విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని మంజునాథ్ వివరించాడు.
ఈ మేరకు తనకు పతిరయ్య సలహా ఇచ్చినట్టుగా వెల్లడించాడు. దీంతో కోర్టు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరికి న్యాయమూర్తి మాటలు విని భార్యతో కలిసి జీవించేందుకు మంజునాథ్ అంగీకరించాడు. అనంతరం న్యాయమూర్తి దంపతులు కోర్టులో దండలు మార్చుకుని కలిసి జీవించాలని ఆకాంక్షించారు.