అనేక మందితో చిట్టీలు కట్టించుకుని రూ.10 కోట్ల మేర వసూలు చేసి పారిపోయిన ఓ మహిళ, ఆమె భర్తపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీకి చెందిన అంజలీ దేవి తన భర్త బాబూ రావుతో కలిసి గత కొన్నేళ కిందట హైదరాబాద్‌కు వలస వచ్చింది. బాబూ రావు సీఆర్‌పీఎఫ్ మాజీ ఉద్యోగి. వారికి ఇద్దరు సంతానం. కాగా వారు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో ఈ జంట స్థానికంగా నమ్మకంగా ఉంటూ నెమ్మదిగా చిట్ ఫండ్ వ్యాపారం మొదలు పెట్టారు. అనేక ఏళ్ల నుంచి వారు ఉంటుండడంతో వారిపై స్థానికులకు నమ్మకం కుదిరింది. దీంతో అనేక మంది వారి వద్ద చిట్టీలు కట్టారు.
కాగా మొత్తం 85 మంది వరకు ఆ జంట వద్ద చిట్టీలు కట్టారు. ఆ మొత్తం రూ.10 కోట్లు అయింది. అయితే ఆ జంట ఆ మొత్తంతో ఉడాయించారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఆ జంట కోసం వారు గాలిస్తున్నారు.
అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది 85 మంది బాధితులే అయినప్పటికీ వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు తెలిసింది. ఈ చిట్‌ఫండ్ స్కాంలో మొత్తం 300 మంది వరకు బాధితులు మోసపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.