కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడడంతో తండ్రి, సవతి తల్లి కలిసి దారుణాకి ఒడిగట్టారు. ఎలాగైనా ఇద్దరు కవలను వదిలించుకోవాలని ప్లాన్ వేశారు. ఇద్దరు మైనర్ కుమార్తె (14)లను పెళ్లి ముసుగులో అమ్మేశారు. కట్ చేస్తే.. కటకటాల పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మాచారెడ్డి మండలానికి చెందిన ఓ వ్యక్తి మొదటి భార్య కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయింది. ఆమెకు కవల పిల్లలు ఉన్నారు. దీంతో భర్త మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు, బిడ్డ ఉన్నారు. మొదటి భార్య ఆడ పిల్లలు పెరిగి పెద్దవుతున్న తరుణంలో.. నలుగురు పిల్లలను పెంచడం తండ్రి, సవతి తల్లికి భారమయ్యింది. ఈ క్రమంలో మొదటి భార్య పిల్లలను వదింలించుకోవాలని ప్లాన్ చేశారు.
దీంతో ఓ మధ్యవర్తిని కలిసి పిల్లలకు పెళ్లి చేయాలని వివరించారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవడానికి ఓ వ్యక్తి ఉన్నాడని, అతనితో పెళ్లి చేస్తే డబ్బులు ఇస్తాడని ఆశపెట్టి రూ.80వేలకు బేరం కుదిర్చాడు. స్థానికంగా స్థిరపడిన రాజస్థానీ వ్యాపారి శర్మన్ కు 14ఏళ్లు ఉన్న ఓ కూతర్ని ఇచ్చి పెళ్లి చేశారు. శర్మాన్ ఇచ్చిన రూ.80వేలలో 30 వేలు మధ్యవర్తి, మిగతా రూ.50వేలు తల్లిదండ్రులకు ఇచ్చారు. అప్పటికే అతనికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉంది.
కొన్నాళ్ల తర్వాత మరో కూతుర్ని హైదరాబాద్ కు చెందిన కృష్ణ కుమార్ అనే వ్యక్తికి రూ.50వేలకు అమ్మి పెళ్లి జరిపించారు. రెండో బాలికను పెళ్లి చేసుకున్న శర్మాన్ మనోహరాబాద్లో కాపురం పెట్టాడు. అయితే తమ భర్తలకు అప్పటికే వివాహమై పిల్లలు ఉన్నారని కవల సోదరీమణులు తెలుసుకున్నారు. దీంతో వారి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో కవల సోదరీమణులలో ఒకరు నిందితుల బారి నుంచి బయటపడి జనవరి 16న ఉగ్గర్వాయి గ్రామానికి చేరుకుంది. వివరాలు తెలుసుకున్న గ్రామస్థులు బాలిక గురించి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డిసిపిఓ) స్రవంతికి సమాచారం అందించారు.
తన తల్లిదండ్రుల దురాఘతం, అలాగే భర్త శారీరకంగా, మానసికంగా వేధించిన తీరును చెబుతూ కన్నీరుమున్నీరయ్యింది. తన భర్త రోజూ వేధిస్తున్నాడని.. కొడుతున్నాడని పేర్కొంది. 100 రూపాయలతో కామారెడ్డికి చేరుకున్నట్లు తెలిపింది. దీనిపై రియాక్ట్ అయిన డీసీపీఓ స్రవంతి ఇప్పుడు కవలలు తమ సంరక్షణలో ఉన్నారని.. వారు చదువుకుంటామంటే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు డీసీపీఓ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కవల సోదరి తండ్రి, సవతి తల్లి, కృష్ణకుమార్, శర్మ, మహేందర్, కాలర్ రాంబటి, ఏజెంట్లుగా పనిచేసిన రమేష్ తోపాటు ఏడుగురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.