సొంతిల్లు కట్టుకోవాలనే కలను సాకారం చేసుకుంది ఆ జంట. కొత్తగా ఇంటిని నిర్మించుకుంది. ఘనంగా గృహప్రవేశం చేసింది. కానీ ఆ తర్వాత రెండు రోజులకే.. ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన వారి కుమార్తె ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దారుణ ఘటన కేరళ ఇడుక్కి జిల్లాలోని పుత్తడి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రవీంద్రన్(50), ఉష(45) లది నిరుపేద కుటుంబం. ఈ దంపతులకు శ్రీ ధన్య అనే కూతురు కూడా ఉంది. ఆర్థికంగా వెనుకపడిన వారికి లైఫ్ ప్రాజెక్టు పేరుతో సొంతిల్లు కట్టుకునేందుకు కేరళ ప్రభుత్వం సాయం అందించింది. ఇందులో భాగంగానే వారు కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. బంధు మిత్రులను పిలుచుకొని గ్రాండ్ గా గృహప్రవేశం కూడా చేశారు. గృహ ప్రవేశం చేసిన రెండు రోజులకే ఉన్నట్టుండి ఇంట్లో ఒక్కసారీగా అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో రవీంద్రన్, ఉష దంపతులు మంటల్లో చిక్కుకుపోయారు. కానీ.. వారి కూతురు శ్రీ ధన్య ఇంటిపైనుంచి బయటకు దూకింది. భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల గమనించి శ్రీ ధన్యతో పాటు.. మంటల్లో చిక్కుకున్న దంపతులిద్దరిని ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే దంపతులు మృతి చెందనట్టు డాక్టర్లు నిర్ధారించారు. మంటల్లో గాయపడిన శ్రీ ధన్యను కోట్టాయం మెడికల్ కాలేజీకి తరలించి వైద్యం అందిస్తున్నట్టు స్థానికులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. వంట గదిలో గ్యాస్ సిలిండర్ పేలి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీధన్య స్పృహలోకి వస్తేకానీ అసలు నిజాలు బయటపడుతాయని పోలీసులు చెప్తున్నారు.