ప్రభుత్వ ఆస్పత్రులు అంటేనే భయమేసే పరిస్థితి నెలకొంది. చికిత్స గురించిన సంగతి పక్కన పెడితే.. కనీసం పసిబిడ్డ మృతదేహానికి ఆంబులెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి దారుణ ఘటనలు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటివరకూ ఇలాంటి ఎన్నో ఘటనలు వెలుగు చూసినా.. తాజాగా మరో ఘటన వార్తల్లో నిలిచింది. పసిబిడ్డ మృతదేహంతో స్కూటీపై ఏకంగా 120 కిలో మీటర్లు ప్రయాణించారు ఆ దంపతులు.
వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడలో జరిగిన విషాద ఘటన మనసుని కలచివేస్తోంది. కేజీహెచ్‌లో మృత్యువాత పడిన తమబిడ్డని తిరిగి ఇంటికి తీసుకెళ్ళేందుకు అంబులెన్స్ కావాలని పసిబిడ్డ తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందిని కాళ్లావేళ్లా పడ్డారు. అయినా ఫలితం శూన్యం.
దీంతో ఏమీ చేయలేక.. పసిబిడ్డ మృతదేహాన్ని చేతుల్లో పెట్టుకుని స్కూటీపై 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకి ప్రయాణం చేశారు తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న పాడేరు ఆసుపత్రి సిబ్బంది స్వగ్రామానికి అంబులెన్స్ ఏర్పాట్లు చేశారు.
మరోవైపు కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.