ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఓవైపు ఈడీ, ఇంకోవైపు సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ఈడీ రెండో ఛార్జ్ షీట్ వేసే ప్రయత్నాల్లో ఉంది. ఇలాంటి టైమ్ లో నిందితులకు బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. సీబీఐ ఛార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్ మహేంద్రులకు బెయిల్ మంజూరైంది. మొత్తం ఏడుగురు నిందితులపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయగా.. అందులో ఐదుగురికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఒక్కొక్కరికి 50వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. నిందితుల రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై సీబీఐకి నోటీసు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంలచనం రేపింది. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై అభియోగాలు ఉన్నాయి. అలాగే.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిల పేర్లను ఈడీ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. అధికార పార్టీల నేతలతో సంబంధాలు కలిగి ఉన్న పలువురు వ్యక్తులను సీబీఐ, ఈడీ అరెస్ట్ చేశాయి. కవితను ఇప్పటికే సీబీఐ ప్రశ్నించింది.
ఢిల్లీ లిక్కర్ దందాను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని దక్షిణాది ప్రాంతానికి చెందిన పలువురు మద్యం ఉత్పత్తిదారులు స్కెచ్ గీశారు. వీరందరితో ఏర్పడిన సౌత్ గ్రూప్ ను కవితతో పాటు శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంట్రోల్ చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. హోల్ సేల్ వ్యాపారంలో వచ్చే లాభాల్లో రామచంద్ర పిళ్లై నుంచి బ్యాంక్ అకౌంట్స్ ద్వారా ముత్తా గౌతమ్ కు రూ.4,756 కోట్లు అందాయని.. అతని అకౌంట్ నుంచి అభిషేక్ బోయిన్ పల్లికి రూ.3.85 కోట్లు ట్రాన్స్ ఫర్ అయినట్లుగా తెలిపింది. అంతేకాకుండా గౌతమ్ కు చెందిన మీడియా సంస్థలకు కూడా కొంత డబ్బు బదిలీ అయిందని స్పష్టం చేసింది.
మొత్తం ఏడుగురు నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ క్రమంలో మంగళవారం బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు ఐదుగురికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అభిషేక్, విజయ్ నాయర్ కు ఇదివరకే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇచ్చింది. ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అనంతరం.. తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది న్యాయస్థానం.