50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఓ కన్నడ చిత్రం ఏకంగా 250 కోట్ల కలెక్షన్స్ సాధించి ఆశ్చర్యానికి గురిచేసిన విషయం గుర్తుందిగా. యస్… యష్ హీరోగా వచ్చిన కే.జీ.ఎఫ్ చిత్రం అది. కేవలం కన్నడం మాత్రమే కాకుండా తెలుగు, హిందీలో కూడా ఈ సినిమా విడుదలై ఘన విజయంతో పాటూ అబ్బురపరిచే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రశంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఈ పార్ట్ 2 లో విలన్ పాత్ర పోషిస్తుండటం ఒక స్లెషల్ అట్రాక్షన్.
ఇటీవలే సంజయ్‌దత్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని తన విలన్ రోల్ “అధీరా” ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఆ సందర్భంగా దత్ మాట్లాడుతూ ఈ అధీరా పాత్ర మార్వెల్ అవెంజర్స్‌లోని వంద ఠానోస్‌లకు సమానం అంటూ చెప్పి సినిమాను హైప్ చేశారు.
ప్రస్తుతం కోలార్ గోల్డ్‌ఫీల్డ్స్ ప్రాంతం దగ్గర్లో ఉన్న సైనైడ్ హిల్స్ ప్రదేశంలో భారీ సెట్స్ వేసి కే.జీ.ఎఫ్ సినిమాను చిత్రీకరిస్తున్నారు. అక్కడ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్టు సమాచారం. ఐతే ఉన్నట్టుండీ రెండవ అదనపు సివిల్-జే.ఎం.ఎఫ్.సీ న్యాయస్థానం నుంచి షూటింగ్ నిలిపివేయాలంటూ ఆదేశాలు రావడంతో యూనిట్ దిగ్భ్రాంతికి లోనయినట్టు సమాచారం.
ఎందుకిలా అని ఆరా తీస్తే తెలిసిన విషయమేంటంటే.. శ్రీనివాస్ అనే ఒక స్థానికుడు ఆ సినిమా షూటింగ్ విషయమై ఒక పిటిషన్ ఫైల్ చేసినట్టు తెలిసింది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నందున, వాటి పర్యవసానంగా అక్కడి పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని తన వాదనలు వినిపించడంతో కోర్ట్ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ హఠాత్ పరిణామానికి షాకయిన సినిమా టీమ్ ఈ తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టుకెక్కింది. ఆ విచారణ సెప్టెంబర్ 23కు వాయిదాపడింది.