లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఉత్తర్వులను కోర్టు శుక్రవారం రిజర్వ్ లో ఉంచింది. ఈ నెల 31 న దీనిపై విచారణ జరగాలని రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జ్ ఎం.కె. నాగ్ పాల్ ఆదేశించారు. అప్పటివరకు సిసోడియా జైల్లోనే ఉండక తప్పదు.
ఈ కేసులో తన క్లయింట్ ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నారని, సాక్షులను ఆయన బెదిరిస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సిసోడియా తరఫు లాయర్ .. వాదించారు. సాక్ష్యాధారాలను ఆయన నాశనం చేశారనడానికి కూడా ఆధారాలు లేవని పేర్కొన్న లాయర్.. తన క్లయింటుకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అయితే సీబీఐ తరఫున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీపీ. సింగ్.. ఇది కేవలం మొబైల్ ఫోన్ల నాశనానికి సంబంధించినది మాత్రమే కాదని, ఎన్నో కీలకమైన ఫైళ్లు కూడా మాయమయ్యాయని అన్నారు.
సాక్ష్యాధారాలను నాశనం చేయడమన్నది సీరియస్ క్రైమ్ అని ఆయన చెప్పారు. సిసోడియాకు చెందిన ఈ-మెయిల్, మొబైల్స్ లేని డేటాను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, వాటిని ఇంకా విశ్లేషించవలసి ఉందని ఆయన అన్నారు. ఫిబ్రవరి 26 న సిసోడియాను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి.