ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్‌మాలిక్‌కు ఢిల్లీ పటియాల కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. న్యాయస్థానం యాసిన్ మాలిక్‌కు శిక్ష విధించిన నేపథ్యంలో అధికారులు జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు.
శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో బంద్ వాతావరణం నెలకొనగా, ఓల్డ్‌సిటీలో ప్రజారవాణా సైతం నామమాత్రంగానే ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
కోర్టులో వాదనల సందర్భంగా యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని సీబీఐ ధర్మాసనానికి విజ్ఞప్తి చేసింది. ఉగ్ర కార్యకలాపాలకు డబ్బులు సమకూర్చిన నేపథ్యంలో యాసిన్ మాలిక్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసినట్లు వేర్పాటువాద నేత మాలిక్ సైతం ఒప్పుకున్నాడు. తనపై నమోదైన అభియోగాలన్నీ అంగీకరించాడు.
ఈ క్రమంలోనే యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని, అతడి ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఎన్‌ఐఎని ఆదేశించింది. ఈ టెర్రర్ ఫండింగ్ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిద్దిన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్‌తో పాటు పలువురు వేర్పాటువాద నేతలపై ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.