న్యాయం కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగేలా చేయకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీజేఐ అన్నారు.
ప్రజలందరికీ న్యాయం అందాలని, ప్రజల వద్దకే కోర్టులు వెళ్లాలని చంద్రచూడ్ తెలిపారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక విప్లవం వచ్చిందని, సాంకేతిక మౌళికసదుపాయాల్ని ధ్వంసం చేయరాదన్నారు. మన దేశంలో భిన్నత్వం ఎక్కువ.. అలాగే ఇలాంటి దేశంలో సవాళ్లు కూడా ఎక్కువే ఉంటాయని ఆయన చెప్పారు.
వర్చువల్ విధానం వల్ల.. లాయర్లు తమ తమ స్వంత ప్రదేశాల నుంచే కేసుల్ని వాదించే అవకాశం వచ్చిందని చంద్రచూడ్ అన్నారు. కేసుల లిస్టింగ్ విషయంలో టెక్నాలజీని ఆశ్రయించాలని సీజేఐ సూచించారు.
న్యాయం అందరికీ అందేలా న్యాయవ్యవస్థ చూడాలని, భారతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక అంశాలను ప్రవేశపెట్టారని సీజేఐ తెలిపారు. సుప్రీంకోర్టు ఢిల్లీలోని తిలక్ మార్గ్ లోనే ఉన్నా.. ఈ దేశానికి అదే అత్యున్న న్యాయస్థానం అని వెల్లడించారు డీవై చంద్రచూడ్.