మహాభారతంలో మధ్యవర్తిత్వం, సంప్రదింపులతో చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. హైదరాబాద్ లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.
ఈ నెల 18న ఐఏఎంసీ ప్రారంభం అవుతుందని చెప్పారు ఎన్వీ రమణ. పెండింగ్ కేసుల సత్వర విచారణ జరగాలని.. ఎవరైనా కోర్టుకు రావడం ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని అభిప్రాయపడ్డారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని.. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.
హైదరాబాద్ ను ఐఏఎంసీ ఏర్పాటు కోసం ఎంపిక చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు సీజేఐ. ఇక్కడ ఫార్మా, ఐటీ, ఇతర పరిశ్రమలు ఉన్నాయని.. పైగా నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ సెంటర్ ఏర్పాటు ఆలోచన గురించి కేసీఆర్ తో ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మధ్యవర్తిత్వం అనేది వివిధ రూపాల్లో ఎప్పటి నుంచో ఉందని చెప్పారు. ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతమన్నారు.