దేశంలో కరోనా వ్యాక్సిన్స్ వేయటం ప్రారంభించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ సౌజన్యంతో అస్ట్రాజెనికా కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ ను సీరం సంస్థ భారత్ లో ఉత్పత్తి చేస్తుంది. ఈ కోవిషీల్డ్ తో పాటు భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ సంయుక్తంగా కోవాక్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేస్తుంది. ఈ రెండు వ్యాక్సిన్లకు భారత్ లో అత్యవసర వ్యాక్సినేషన్ అనుమతులు వచ్చాయి.
అయితే, కోవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్ భారత్ లో ఇంకా కొనసాగుతుండగా… ఇతర దేశాల్లో ఫేజ్-3ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. కానీ కోవాక్జిన్ వ్యాక్సిన్ మాత్రం ఇంకా ఫేజ్-3 ట్రయల్స్ లోనే ఉంది. 20వేల మందికి పైగా డోసులు ఇచ్చినా… ఆ డేటా ఇంకా రావాల్సి ఉంది.
భద్రతపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాక్సిన్ నిపుణు కమిటీ, డీసీజీఐ అనుమతి ఇచ్చినప్పటికీ… కోవాక్జిన్ ఇస్తున్న వారి నుండి కన్సెంట్ ఫాం తీసుకుంటున్నారు. అందులో ఇది ఇంకా ఫేజ్-3 ట్రయల్స్ లోనే ఉందని మాకు తెలుసు, తెలిసే మేం ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నాం అని సంతకం చేయించుకుంటున్నారు.
ఈ కోవాక్జిన్ తీసుకొని… వ్యాక్సిన్ కారణంగా అనారోగ్యానికి గురైతే వారికి అందించే చికిత్స బాధ్యత మొత్తం భారత్ బయోటెక్ కంపెనీయే తీసుకోవాల్సి ఉంటుంది.