రాష్ట్రంలో కరోనా మూడో దశ ప్రారంభమైందని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తే మూడో దశ నుంచి త్వరగా బయటపడవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటా, బయటా మాస్క్ ధరించాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని.. టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో కరోనా మూడో దశ ప్రారంభమైందని చెప్పారు డీహెచ్. ఆరోగ్య శాఖ సూచనలను ప్రజలంతా పాటించాలని కోరారు. 2 కోట్ల కోవిడ్ పరీక్షల కిట్లను సిద్ధంగా ఉంచామని.. తెలంగాణలో జనవరి 1 నుంచి కేసులు పెరిగాయన్నారు. కేసుల పెరుగుదలను ముందుగానే గుర్తించామని.. కరోనా పరిస్థితులపై రోజూ సమీక్ష చేస్తున్నామని తెలిపారు. వేల సంఖ్యల్లో కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్ర ప్రభావం లేదని వెల్లడించారు.
ఒమిక్రాన్ బారిన పడిన వారు 5 రోజుల్లోనే కోలుకుంటున్నారని తెలిపారు శ్రీనివాసరావు. కేవలం 10 శాతం మందిలో మాత్రమే వైరస్ సోకిన వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.. డెల్టా వేరియంట్ పూర్తిగా తొలగిపోలేదన్నారు. డెల్టా సోకితే లక్షణాలు మూడ్రోజుల తర్వాత బయటపడతాయని… కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. స్వల్ప లక్షణాలున్నవారు ఇళ్లలోనే ఐసోలేషన్ లో ఉండాలని కోరారు.
ర్యాపిడ్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నామని చెప్పారు డీహెచ్. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామన్నారు. భవిష్యత్ లో 90 శాతం కేసులు ఒమిక్రాన్ వే ఉంటాయని హెచ్చరించారు. వచ్చే నాలుగు వారాలు చాలా ముఖ్యమని.. ఫిబ్రవరి నెలలో మళ్లీ కేసులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రజారోగ్య సిబ్బందికి 4 వారాలు ఎలాంటి సెలవులు ఉండవని స్పష్టం చేశారు.