కరోనా వైరస్ ప్రభావం తెలంగాణలో పంజా విసురుతోంది. ఇండోనేషియా నుండి వచ్చి కరీంనగర్ లో పర్యటించిన బృందానికి కరోనా పాజిటివ్ రావటం, వారంతా కరీంనగర్ లో తిరగటంతో… కరీంనగర్ పై ప్రత్యేక దృష్టితో 100బృందాలు రంగంలోకి దిగాయి.
కరోనా కట్టడి కోసం తానే స్వయంగా కరీంనగర్ లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. శుక్రవారమే పర్యటన ఖరారైనా… కరోనా కట్టడిపై సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం ఉన్నందున, శనివారం కరీంనగర్ లో పర్యటించబోతున్నారు.
కరీంనగర్ లో పరిస్థితిని సమీక్షించటంతో పాటు అవసరమైతే ప్రత్యేకంగా నిధులు కూడా ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర వైద్య సహాయంపై కేసీఆర్ సమీక్ష నిర్వహించటంతో పాటు సీఎంవో అధికారుల్లో ఒకరికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో కరీంనగర్ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్న స్మిత సబర్వాల్ కు ఈ బాధ్యత అప్పగించే అవకాశం ఉండగా, పోలీసులకు మరింత బాధ్యత అప్పజెప్పి కరోనా వైరస్ ప్రబలకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయబోతున్నట్లు సీఎంవో వర్గాల సమాచారం.