కరోనా మహమ్మారితో సహజీవనం తప్పదని మొదట్నుంచి మేధావులు చెబుతూ వస్తున్నారు. దానికి తగ్గట్టే మహమ్మారి కొత్త వేరియంట్ల రూపంలో వచ్చి పడుతోంది. దీంతో ఇది అంతం కాదు.. సహజీవనం తప్పదని ప్రజలు కూడా నమ్మే పరిస్థితి వచ్చేసింది. తాజాగా తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి చేసిన వ్యాఖ్యలు కూడా దానికి బలాన్ని చేకూర్చుతున్నాయి.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటు చేసిన దావోస్ ఎజెండా-2022 సమ్మిట్ లో ప్రపంచ ఆరోగ్యసంస్థ హెల్త్ ఎమెర్జెన్సీ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ మాట్లాడారు. ప్రపంచ జనాభాలో అధికశాతం మంది టీకాలు వేసుకోవడం వల్ల కోవిడ్ తీవ్రత తగ్గిందని చెప్పారు. ఇదే కొనసాగితే ఈ ఏడాది ప్రపంచంలో ప్రజారోగ్య అత్యవసర స్థితికి ముగింపు పలకవచ్చని అభిప్రాయపడ్డారు. అదే కరోనాకు కూడా ముగింపు అనుకోవాలి తప్ప… పూర్తిగా వైరస్ ను అంతం చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.
మహమ్మారిని అంతం చేయడం సాధ్యం కాదని తెలిపారు ర్యాన్. ఇలాంటి వైరస్ లు పర్యావరణ వ్యవస్థలో భాగమవుతాయని అన్నారు. అయితే అత్యవరసర ఆరోగ్య స్థితి మాత్రం మారుతుందని.. సాధారణ జీవితం సాధ్యమవుతుందని తెలిపారు.
వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేస్తే.. మరణాలు, ఆసుపత్రుల్లో చేరికలు, లాక్ డౌన్ లను ఈ ఏడాది చివరికి ఆపే అవకాశం ఉంటుందన్నారు మైకేల్ ర్యాన్. మన దేశంలో టీకా ప్రక్రియ స్పీడ్ గానే కొనసాగుతోంది. ఇప్పటికే 90 శాతానికి పైగా ఫస్ట్ డోస్ పంపిణీ జరిగింది. ఈమధ్యే టీనేజర్లకు ఫస్ట్ డోస్, వృద్ధులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ ప్రారంభించారు.