ఏ భార్యకైనా తన భర్త బతికే ఉన్నాడా అనే ప్రశ్న ఎంత దుఖంతో వస్తుందో ఊహించుకోవచ్చు. వనస్థలిపురానికి చెందిన ఆ కుటుంబాన్ని కరోనా మహమ్మారి కబలించింది. 42 సంవత్సరాల వయస్సున్న తన భర్తకు ముందుగా కరోనా రాగా, ఆ తర్వాత కుటుంబంలో భార్యకు సహా మరికొందరికి వచ్చింది.
కుటుంబం మొత్తం కోలుకొని ఇంటికి చేరుకున్నారు. కానీ తన భర్త మాత్రం ఇంటికి రాలేదు. తన భర్త ఆచూకి కోసం ఆ ఇల్లాలు ఎవరి వద్దకు వెళ్లినా లాభం లేకపోవటంతో ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ దృష్టికి విషయం తెచ్చింది. అసలు నా భర్త ఎక్కడున్నాడు…? ఎలా ఉన్నాడు…? అసలు ఉన్నాడా…? అంటూ ఆవేదనతో ప్రశ్నించింది. ఎందుకు ఆసుపత్రి వర్గాలు తన భర్త సమాచారాన్ని దాస్తున్నాయో అర్థం కావటం లేదని మండిపడింది.
దీనిపై కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 1న, సాయంత్రం 6.03నిమిషాలకు మరణించాడని… కరోనా వైరస్ తో పాటు న్యూమోనియా సహా ఇతర అనారోగ్యం ఉండటంతో బతికించలేకపోయామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రకటించారు. ఎవరైనా కరోనాతో మరణిస్తే కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్పగిస్తామని, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరిస్తే జీహెచ్ఎంసీయే దహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని… ఈ కేసులోనూ తాము పోలీసులకు బాడీ అప్పగించామని ఆయన తెలిపారు.
ఇందులో అసలు విషయం ఏమంటే… గాంధీలో సాయంత్రం 6.03నిమిషాలకు మరణించాడని ఆసుపత్రి పేర్కొనగా, ఆ రోజు ప్రభుత్వం రాత్రి 8గంటలకు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఎలాంటి మరణాలు సంభవించలేదని చెప్పటం గమనార్హం. అంతకు ముందు ఇదే వనస్థలిపురానికి చెందిన ఓ వ్యక్తి మరణించాడని అధికారులు దృవీకరించారని కానీ హెల్త్ బులిటెన్స్ లో మాత్రం మరణించినట్లు చూపించటం లేదని ఆ కుటుంబ సభ్యుడొకరు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ప్రభుత్వం, ఆసుపత్రి వర్గాలపై అనుమానాలు వ్యక్తం అవుతుండగా… ఎందుకు ఈ దాగుడు మూతలు అని పలువురు నిలదీస్తున్నారు.