దేశంలో ఇటీవల కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. వ్యాధి అనేది పాండెమిక్ నుంచి ఎపిడమిక్ కు మారే సందర్భంలో సాధారణంగా కేసుల సంఖ్య పెరుగతూ, తగ్గుతూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్క్ లు ఉపయోగించకపోవడం, ప్రయాణాలు పెరగడం, కొవిడ్ వ్యాక్సిన్లు తక్కువగా తీసుకోవడం వంటి అంశాల వల్ల ఇటీవల కేసుల సంఖ్య పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దీనిపై ఎయిమ్స్ ప్రముఖ ఎపిడమాలజిస్ట్ సంజయ్ మాట్లాడుతూ….. SARS-CoV-2 అనేది ఆర్ఎన్ఏ వైరస్ అని తెలిపారు. ఈ వైరస్ ఐదు రకాలుగా ఉన్నప్పటికీ వేయి కన్నా ఎక్కువ మ్యుటేషన్స్ చెందిందని ఆయన వెల్లడించారు.
‘భారత్ గతేడాది సెకండ్ వేవ్ ను చూసింది. ఈ సమయంలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ఇది చాలా దురదృష్టకరం. అయితే ఇది SARS-CoV-2కి వ్యతిరేకంగా కమ్యూనిటీ స్థాయి సహజ రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడానికి దోహదపడింది. సాధారణంగా సహజమైన ఇన్ ఫెక్షన్ అనేది కొవిడ్ కు వ్యతిరేకంగా మెరుగైన, సుదీర్ఘ రక్షణను అందిస్తుందని సాక్ష్యాలు ఉన్నాయి.’ అని అన్నారు.
ఇప్పటికే పెద్ద ఎత్తున జనాభాకు వ్యాక్సిన్ అందింది. అందువల్ల కొత్త వేరియంట్ వచ్చి ఇప్పటికే ఉన్న సహజ రోగనిరోధక శక్తిని నాశనం చేసి, తీవ్ర వ్యాధిని కలిగించేంత వరకు భవిష్యత్తులో మరో వేవ్ వచ్చే అవకాశం లేదన్నారు.
మరో వైద్య నిపుణుడు చంద్రకాంత్ లహరియా మాట్లాడుతూ… SARS-CoV-2 ఇంకా వ్యాపించే ఉందన్నారు. అందువల్ల కేసుల సంఖ్యలో హెచ్చు తగ్గులు సహజమన్నారు. అందువల్ల కేసులు పెరిగినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.