దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో కొత్త లక్షణాలు బయటపడ్డట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. కరోనా రోగుల్లో కొందరిలో అతిసారం, కడుపు నొప్పి లక్షణాలు గుర్తించినట్టు వైద్యులు తెలిపారు.
ఢిల్లీలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల్లో 20 శాతం మందిలో అతిసారం ప్రధాన లక్షణంగా కనిపించినట్టు అపోలో హాస్పిటల్ లో రెస్పిరేటరీ మెడిసిన్ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ నిఖిల్ మోడీ చెప్పారు. కొవిడ్-19తో అతిసారం వస్తుందన్న విషయం చాలా మందికి తెలియదన్నారు. ఎక్కువ మంది టెస్టులకు కూడా వెళ్లడం లేదన్నారు. కొన్ని సందర్భాల్లో పేషెంట్లకు అతిసారం ఒక్కటే లక్షణంగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
ఇటీవల పిల్లలలో ఎక్కువగా డయేరియా కేసులు వస్తుండటం వైద్యులు చూస్తున్నారని తెలిపారు. వారు ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ తో అతిసారానికి గురవుతారని చెప్పారు. కొంతమంది రోగులలో సాధారణ జ్వరం, బలహీనత, దగ్గు, జలుబు కాకుండా తరచుగా విరేచనాలు, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలను గమనిస్తున్నట్టు తెలిపారు.
వీరిలో ఎక్కువ మంది రోగులు హోమ్ ఐసోలేషన్ లో ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నట్టు చెప్పారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్, బీఏ 2 వేరియంట్ దాని ఉప విభాగాలు జీర్ణాశయ సమస్యలను కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.