ఇండియాలో కరోనా కేసులను కట్టడి చేయగలిగామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో గత 24 గంటల్లో తాజాగా 145 కేసులు నమోదయ్యాయని, యాక్టివ్ కేసులు 1946 కి తగ్గాయని వెల్లడించింది. కోవిడ్ రీకవరీ రేటు 98.81 శాతం ఉందని, అయితే మొదట ప్రకటించినట్టు కరోనా సంబంధ గైడ్ లైన్స్ అమలులో ఉంటాయని వివరించింది. ఇప్పటివరకు దేశంలోదాదాపు మూడేళ్ళ నుంచి 4.46 కోట్ల కోవిడ్ కేసులను నమోదు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇక చైనా విషయానికి వస్తే దేశంలో ఇంకా కోవిడ్ కేసులు తగ్గలేదని అక్కడి గ్లోబల్టైమ్స్ పత్రిక తెలిపింది.
మందుల కొరత కారణంగా లక్షలాది ప్రజలు ఆయుర్వేద మందులపైనే ఆధారపడుతున్నారని, అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కూడా ఈ మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. అయితే తమ దేశంలో కరోనా కేసులు తగ్గాయని చూపడానికి అంతర్జాతీయ ప్రయాణికులపై నిర్బంధ క్వారంటైన్ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది.
అంతర్జాతీయ బోర్డర్స్ ని కూడా మళ్ళీ తెరిచింది. చైనాలోని మందుల తయారీ దారులు ముఖ్యంగా దగ్గు, జ్వరాన్ని నివారించే ఔషధాల ఉత్పత్తిని పెంచుతున్నట్టు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. చైనా జనాభా అవసరాలను, ముఖ్యంగా కోవిడ్ రోగులను దృష్టిలో నుంచుకొని ఆ దేశానికి మోడెర్నా వ్యాక్సిన్ ను అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సంస్థ సీఈఓ స్టెఫానీ బ్యాన్సెల్ తెలిపారు.
కానీ విదేశాల వ్యాక్సిన్ బదులు తాము స్వదేశంలోనే ఉత్పత్తి చేసుకుంటున్న వ్యాక్సిన్ ని వాడాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్ లో నాణ్యత లోపించిందని అక్కడి రీసెర్చర్లు కొందరు పెదవివిరుస్తున్నారు.