కరోనా వైరస్ విషయంలో ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులను ఆదేశించారు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. శుక్రవారం సంబంధిత వైద్య అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వైద్యులకు పలు సూచనలు చేశారు.
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా వైరస్ మరలా విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్, ప్రికాషన్ డోసు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అన్ని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలలో వాక్సిన్ అందుబాటులో ఉండేలా చూడాలని అదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు మంత్రి హరీష్ రావు.
ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వి, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీహెచ్ శ్రీనివాస్ రావు, డీఎంఈ రమేష్ రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.