ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరి జగన్నాథ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆర్టీపీసీఆర్ నెగెటివ్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా ఆలయంలోకి భక్తులందరిని అనుమతించనున్నట్టు తెలిపారు.
గతంలో కరోనా నేపథ్యంలో అధికారులు ఆలయంలో కఠిన నిబంధనలు అమలు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిపికెట్లను అందజేయాలని నిబంధనలు పెట్టారు.
కానీ ఇటీవల దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిబంధనలను ఎత్తి వేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ప్రతి ఆదివారం ఆలయాన్ని శుభ్రపరుస్తున్న నేపథ్యంలో ఆ రోజు భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని చెప్పారు.
అయితే ఆలయంలోకి వచ్చే భక్తులు మాస్కులను ఖచ్చితంగా ధరించాల్సిందేనని, భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.